ఊహించని రీతిలో బదిలీ వేటు వేసిన సర్కార్
తిరుమల : టీటీడీ పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. టీటీడీ చరిత్రలోనే రెండోసారి ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఏకైక ఆఫీసర్ తను. ఆయనకు మంచి ఆఫీసర్ అన్న పేరుంది. అంతే కాదు ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామికి అపర భక్తుడు. గతంలో జగన్ రెడ్డి హయాంలో టీటీడీ ఈవోగా ఉన్న సమయంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కానీ లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంది. దీనిపై ఏపీ తాజా సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది.
ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆనాడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ నిర్లక్ష్యం, అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీల ప్రమేయం లేక పోలేదని సంచలన ఆరోపణలు చేసింది. దీంతో చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేయాలని సీఎస్ కె. విజయానంద్ ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సింఘాల్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సీఎంఓలో ఉన్న రవిచంద్రకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బదిలీపై వెళుతున్న సింఘాల్ ఇవాళ స్వామి వారిని చివరి సారిగా దర్శించుకున్నారు. అడిషనల్ ఈవోకు ఛార్జ్ అప్పగించారు.







