గిరిజ‌న ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌

VijayaBhaskar · March 7, 2026
Spread the love

నిధులు కేటాయించామ‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న‌స‌భ‌లో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ప‌నులు, నిధులు మంజూరు, త‌దిత‌ర వివ‌రాల‌తో బుక్ లెట్ల‌ను ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీక‌ర్ కు అంద‌జేశారు స్వ‌యంగా. ఈ ప్రక్రియలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ గిరిజన ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అత్యధికంగా కేటాయింపులు చేసిన‌ట్లు తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించిన తొలి మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయించారు. పల్లె పండగ 1.0 ద్వారా రూ. 4,500 కోట్ల నిధులతో గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల అంతర్గత రహదారులు, 22,514 మినీ గోకులాలు, 1,02,000 ఫారం పాండ్స్, 15,000 నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. 65 వేల ఎకరాల్లో పండ్ల తోటలు నాటించారు.

పల్లెపండగ 2.0లో రూ. 5,715 కోట్ల నిధులతో గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు, 15,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు, ఫారం పాండ్స్, నీటితొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు నాటే ప్రక్రియ పూర్తి చేశారు. రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులుతో 4,122 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా రూ. 1,005 కోట్ల నిధులుతో గిరిజన గ్రామాల్లో 1,021 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టారు. తద్వారా 625 ఆవాసాలకు తొలిసారి రోడ్ల సౌకర్యం కల్పించనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులతో పాటు మానవ వన్యప్రాణి సంఘర్షణను నివారించేందుకు హనుమాన్ లాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్తున్నారు.