అనంతపురం జిల్లా : టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా లోని నర్పాల మండలంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ (MPTC) , జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు , మండల స్థాయి నాయకులతో క్యాంప్ కార్యాలయంలో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఎంపీటీసీ నియోజకవర్గంలోని ఎన్నికల ఫలితాలను విడివిడిగా సమీక్షించి, పార్టీ అభ్యర్థుల గెలుపోటములకు గల కారణాలను విశ్లేషించడం జరిగింది. ప్రతి గ్రామంలోని ఎన్నికల పరిస్థితులు, నాయకుల పాత్ర, ప్రచార సరళి, పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఆరా తీశారు బండారు శ్రావణి శ్రీ. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు , సమన్వయ లోపం ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపాయో కూడా చర్చించారు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే. ఓటమికి గల కారణాలను గుర్తించి, భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ కోసం అవిశ్రాంతంగా శ్రమించే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తూ, అందరం కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఇప్పటి నుండే ప్రతి గ్రామంలో బలమైన కార్యాచరణ ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్త ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగాలని పిలుపునిచ్చారు బండారు శ్రావణి శ్రీ.




