హైదరాబాద్ : ‘జంగా’ చిత్రంలో త్రిగుణ్ పాత్రకు సంబంధించిన గాఢమైన తీవ్రతతో కూడిన గ్లింప్స్‌ను విడుదల చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో త్రిగుణ్ , వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కెవిన్ గడ్డం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మానవ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత , డార్క్ డ్రామాల కలయికతో శక్తివంతంగా ఉండబోతోంది. ‘జంగా’ ఫస్ట్ లుక్ పోస్టర్లో త్రిగుణ్ చాలా తీవ్రమైన, కఠినమైన రూపంలో కనిపిస్తున్నారు. ఇందులో ఉన్న పదునైన సంభాషణలు, డార్క్ విజువల్స్ , ఆసక్తికరమైన పాత్రలు ప్రేక్షకుల్లో కుతూహలాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా మానవ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, జీవితం , మరణం వంటి అంశాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. త్రిగుణ్ చెప్పిన గాఢమైన వాయిస్ ఓవర్ మనుషుల్లో వస్తున్న మార్పుల గురించి , మానవత్వాన్ని కోల్పోవడం వల్ల కలిగే పరిణామాల గురించి వివరిస్తుంది.
విజువల్స్‌లో ఆయన నోటిలో మద్యం సీసాతో సైకిల్ తొక్కుతూ, శ్మశానవాటికలో అంత్యక్రియలను గమనిస్తుండటం కనిపిస్తుంది. మరోవైపు వరలక్ష్మి శరత్‌కుమార్ రౌడీలను కాల్చివేసే సన్నివేశంలో ఎంతో తీవ్రతతో ఆకట్టు కుంటున్నారు. ఈ చిత్రం బలమైన డ్రామాతో పాటు లోతైన భావోద్వేగాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. త్రిగుణ్ బాడీ లాంగ్వేజ్, హావభావాలు , వరలక్ష్మి శరత్‌కుమార్ నటన సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ఒక గ్రామీణ నేపథ్యాన్ని తీసుకురాగా, కృష్ణ సౌరభ్ అందించిన నేపథ్య సంగీతం సినిమా తీవ్రతను మరింత పెంచింది. ఈ చిత్రానికి కెవిన్ గడ్డం (శ్రీహరి) రచన , దర్శకత్వం వహించారు. వనిత కిలారి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని, ‘ఆర్.కె. ఫిల్మ్ ఫ్యాక్టరీ’ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్నారు.




