Friday, 13 November 2026

ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ ‘గాడ్ ఆఫ్ వార్ సినిమా ప‌క్కా

newsseals-Nagavamshi

హైద‌రాబాద్ : గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థల నుంచి విడి పోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాత చినబాబు (ఎస్. రాధాకృష్ణ) నాగ వంశీ నిర్వహిస్తున్న ఈ నిర్మాణ సంస్థల నుంచి త్రివిక్రమ్ తప్పుకోవాలని చూస్తున్నారని, ఆయన తన తదుపరి చిత్రాల కోసం ‘డివివి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌తో జత కట్టవచ్చని కథనాలు వచ్చాయి. అంతే కాకుండా త్రివిక్రమ్‌కు ఈ నిర్మాతలకు మధ్య విభేదాలు తలెత్తాయని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’ పరిస్థితి ఏమవుతుందోనని వారు భయపడ్డారు. ఈ విభేదాల వల్ల సినిమా ఆలస్యం కావచ్చని లేదా పూర్తిగా రద్దు కావచ్చని కూడా కొందరు ఆందోళన చెందారు.

అయితే శుక్ర‌వారం నిర్మాత నాగ వంశీ కౌంట‌ర్ ఇచ్చారు. పుకార్ల‌కు చెక్ పెట్టారు. అవ‌న్నీ అబ‌ద్దాలేనంటూ కొట్టి పారేశారు. ఆయన ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకుండా లేదా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోలో నిర్మాత చినబాబు, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నందమూరి కల్యాణ్ రామ్ అందరూ కలిసి కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటో ద్వారా త్రివిక్రమ్ తమ నిర్మాణ సంస్థ నుంచి తప్పుకుంటున్నారనే వార్తలను నాగ వంశీ పరోక్షంగా ఖండించినట్లయింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ అనుకున్నట్లే ముందుకు సాగుతుందనే భరోసాను ఇది అభిమానులకు కల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *