హైదరాబాద్ : కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా దూకుడు పెంచింది. నగరంలో ఆక్రమణలకు గురైన చెరువులను రక్షించే పనిలో పడింది. అంతే కాకుండా చెరువులను పునరుద్దరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా ఆక్రమణదారులను గుర్తించి వారికి కోలుకోలేని రీతిలో షాక్ ఇస్తున్నారు కమిషనర్. తాజాగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లి మండలం కైత్లాపూర్ గ్రామంలోని కైత్లాపూర్ సరస్సును ఆక్రమణదారుల, కబ్జాకోరల నుంచి హైడ్రా కాపాడింది. సరస్సు పూర్తి నీటి మట్టం (FTL) పరిధిలోకి వచ్చే 9.06 ఎకరాల భూమిని ఆక్రమణల నుండి కాపాడేందుకు ఆ ప్రాంతం చుట్టూ హైడ్రా కంచెను ఏర్పాటు చేసింది. ఈ పనుల సమయంలో, పొదల్లో దాగి ఉన్న ఒక సమాధి రాయి (సమాధిని సూచించే రాయి) జేసీబీ తగలడంతో పక్కకు పడిపోయింది.
దీనివల్ల స్వల్ప గందరగోళం ఏర్పడింది. ముళ్ల పొదలను JCBతో తొలగిస్తున్నప్పుడు ఈ రాయి పడిపోయింది. అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న హైడ్రా అధికారి మాట్లాడుతూ సమాధి ఉన్న ప్రాంతాన్ని మినహాయించి, మిగిలిన ఎఫ్టీఎల్ పరిధిని రక్షించేందుకే కంచె ఏర్పాటు చేశామని తెలిపారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. హైడ్రా అక్కడ కంచెను ఏర్పాటు చేయడంతో పాటు ఆ భూమి సరస్సు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ప్రాంత వాసులు హైడ్రా పనితీరును మెచ్చుకున్నారు. కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపారు.




