Friday, 13 November 2026

రూ. 1,800 కోట్ల‌తో మోండెలెజ్ కంపెనీ విస్త‌ర‌ణ

newsseals-APCM

విశాఖ‌పట్నం : విశాఖ వేదిక‌గా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పలు సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సమీర్ జైన్ , ఎస్.ఎల్.ఎన్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్. సతప్పన్‌లతో ఆంధ్రప్రదేశ్‌లో వారి విస్తరణ ప్రణాళికలు , పెట్టుబడి అవకాశాలపై ఫలవంతమైన చర్చలు జరిపారు. తిరుప‌తి లోని శ్రీ సిటీలో మోండెలెజ్ చేపట్టనున్న ₹1,800 కోట్ల విస్తరణ గురించి చర్చించారు. ఇది స్థానిక సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి, ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ కోకో మిషన్ ద్వారా కోకో సాగును ప్రోత్సహించడానికి, , తిరుపతిలో కోకో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపించడానికి గణనీయమైన అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

ఎస్.ఎల్.ఎన్ కాఫీతో తిరుపతిలో కాఫీ ప్రాసెసింగ్ , ఇన్‌స్టంట్ కాఫీ తయారీ కేంద్రంలో వారు ప్రతిపాదించిన ₹2,500 కోట్ల పెట్టుబడి గురించి చర్చించిన‌ట్లు తెలిపారు. దీని ద్వారా 1,400 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. తాము అరకు కాఫీని ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లే అంశాన్ని కూడా అన్వేషించామ‌న్నారు. ఇదే క్ర‌మంలో . సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరైన జపాన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (జేఆర్ఐ) ఛైర్మన్ కెన్జీ హిరమత్సు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక పారిశ్రామిక క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి జపాన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. అనంతపురం లేదా విశాఖపట్నంలో ఈ పారిశ్రామిక క్లస్టర్‌లను ఏర్పాటు చేయడానికి తమ కంపెనీలు ముందుకు వస్తాయని, జేఆర్ఐ ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చ్‌తో కలిసి పనిచేస్తోందని ఛైర్మన్ తెలిపారు. త్వరలో అమరావతిలో ఏపీ-జపాన్ బిజినెస్ సమ్మిట్‌ను నిర్వహించాలని తాము యోచిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు తన మద్దతును అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *