Sunday, 15 November 2026

మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక‌వేత్త‌లుగా మారుస్తాం

newsseals-Seethakka

హ‌నుమ‌కొండ జిల్లా : మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దుతున్నాం అన్నారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం లక్ష్యం పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమేనని, మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి స్వయం ఉపాధి ద్వారా వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కుడా (KUDA) చైర్‌పర్సన్ గుండు సుధారాణి, ప్రజా ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు. గతంలో మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చేవి కావని, కానీ ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ, వ్యాపారవేత్తలుగా మారుతున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

మహిళా సంఘాల సభ్యులకు రుణ బీమా సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక చేపల విక్రయ వాహనం అందించడం ద్వారా లబ్ధిదారులు వ్యాపారాలు నిర్వహిస్తూ లాభాలను పొందుతున్నారని గుర్తు చేశారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఆరు హామీల’ అమలు ద్వారా పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు వంటి అర్హులైన వారికి 4.50 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసిందని ఆమె వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ, బడ్జెట్‌లో పెద్ద మొత్తాన్ని సంక్షేమ పథకాల కోసం కేటాయిస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *