కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ
న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్ లో అద్బుత విజయాన్ని నమోదు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రత్యేకించి ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు విల విల లాడింది ఢిల్లీ క్యాపిటల్స్. ఏ కోశాన పోటీ ఇవ్వలేక పోయింది. ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ప్రధానంగా ఆర్సీబీ స్టార్ పేసర్స్ జోష్ హేజిల్ వుడ్ , భువనేశ్వర్ కుమార్ ల కళ్లు చెదిరే బంతులకు విల విల లాడారు. వికెట్లను పారేసుకున్నారు. పెవిలియన్ బాట పట్టారు. జోష్ హాజిల్ వుడ్ కేవలం 12 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీస్తే భువనేశ్వర్ కుమార్ 5 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో 75 పరుగులకే చాప చుట్టేసింది. పోరెల్ 30 రన్స్ , డేవిల్ మిల్లర్ 19 రన్స్ చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది.
ఈ సందర్భంగా మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు విరాట్ కోహ్లీ. ఈరోజు మ్యాచ్ గెలిచినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ప్రత్యేకంగా భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లకు ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు వారు బౌలింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించాడు. ఇద్దరూ అమోఘంగా ఆడారు. నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటి స్పెల్ చూడలేదని చెప్పాడు కోహ్లీ. దాదాపు తొంభై శాతం మ్యాచ్‌ను పవర్‌ప్లేలోనే గెలిపించామని చెప్పవచ్చు. ఇది ఒక అద్భుతమైన స్పెల్. ఒక జట్టుగా, మేము ఇలాగే ఆడుతూ, రాబోయే మ్యాచ్‌లపై దృష్టి సారించాలని అనుకుంటున్నామని అన్నాడు.







