Friday, 16 October 2026

టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆహ్వానం

newsseals-TTD

విద్యార్థుల‌కు ఉచితంగా మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు

తిరుపతి : టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌ల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.. జూన్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో https://admission.tirumala.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది టీటీడీ. ఆన్ లైన్ దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపింది.

విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే ” Student Manual in English” or “Student Manual in Telugu” రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ లపైన క్లిక్ చేశాక, అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అనంతరం ఇంటర్మీడియట్ కోర్సుకు Junior Collegeను ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు లేదా తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి. వాటిలో తమకు కావాల్సిన బాక్స్ లపై క్లిక్ చేయగానే టిటిడి ఆధ్వర్యంలోని రెండు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఉన్న వివిధ గ్రూప్ లలోని సీట్లు, వాటిలో ప్రవేశానికి కావాలసిన అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి.

విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటును తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయించి, విద్యార్థుల‌కు ఎస్ఎమ్ఎస్ పంపుతారు. సీటు పొందిన సదరు విద్యార్థి ధృవీకరణ పత్రాలను వారి సమక్షంలోనే సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు. అయితే విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా (టాలీకాకున్న) సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు రద్దు అవుతుంది. విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్‌ను, క‌ళాశాల‌ ప్రాస్పెక్ట‌స్‌ను పూర్తిగా చదివి పక్కన పెట్టుకుని ఆన్ లైన్ లో చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టిటిడి కోరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *