newsseals.com

క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో ఘ‌నంగా గ్రంధి పవిత్ర సమర్పణ

July 28, 2026 · VijayaBhaskar

తిరుప‌తి : తిరుపతి లోని శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి ప‌విత్రోత్స‌వాలు అత్యంత వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఈసంద‌ర్భంగా భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ఇదే క్ర‌మంలో ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చేస్తోంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టిటిడి). ఇదిలా ఉండ‌గా ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గ్రంధి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

ఉదయం సుప్రభాత సేవతో శ్రీ కపిలేశ్వర స్వామి వారిని మేల్కొలిపి, పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆగమ సంప్రదాయాల ప్రకారం నిత్యహోమం, గ్రంధి పవిత్ర సమర్పణ, మూల మూర్తులకు విశేష ఉపచారాలు ఘనంగా చేపట్టారు. పవిత్రోత్సవాల ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని కృపా కటాక్షాలను పొందారు. సాయంత్రం యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related News