Saturday, 17 October 2026

తమిళనాడు క్రీడా మౌలిక సదుపాయాల సమూల ప్రక్షాళన

newsseals-AdhavaArjuna

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఆధునిక క్రీడా వసతి గృహాలు (హాస్టల్స్), మెరుగైన స్టేడియంలు , ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలతో సహా క్రీడా మౌలిక సదుపాయాలను సమూలంగా ఆధునీకరించనున్నట్లు మంత్రి ఆధవ్ అర్జున ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మినీ-స్టేడియంల నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ఆయన తెలిపారు. ఈ సదుపాయాలను రీ-డిజైన్ చేయడం, ప్రస్తుతం ఉన్న మట్టి ట్రాక్‌ల స్థానంలో ఏడాది పొడవునా ఉపయోగించ దగిన ‘ఆల్-వెదర్ ట్రాక్‌ల’ను (ఏ వాతావరణంలోనైనా వాడదగిన ట్రాక్‌లు) ఏర్పాటు చేయడం దీని ఉద్దేశ్యం. కరూర్ వంటి ప్రాంతాల్లోని ట్రాక్‌ల నాణ్యత సరిగా లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ, కొన్ని ట్రాక్‌ల ఉపరితలాలు చాలా గరుకుగా ఉండటం వల్ల క్రీడాకారులు పరిగెత్తేటప్పుడు గాయాల పాలయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రాంతీయ బలాలు , అవసరాలకు అనుగుణంగా శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడానికి తమిళనాడును ఎనిమిది క్రీడా జోన్‌లుగా విభజించారు. పాఠశాల విద్యాశాఖతో సమన్వయం చేసుకుని, ప్రతి జిల్లాలోనూ ముఖ్యంగా దక్షిణ. డెల్టా ప్రాంతాలలో ఒక పాఠశాలను ఎంపిక చేసి, అక్కడ సమగ్ర క్రీడా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని మంత్రి తెలిపారు. అలంగనల్లూర్ . వడిపట్టి ప్రాంతాల్లోని పాఠశాలల్లో క్రీడా మైదానాల నిర్వహణ సరిగా లేదని షోలావందన్ ఎమ్మెల్యే కరుప్పయ్య వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మదురైలో అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయం ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే కార్తికేయన్ డిమాండ్‌కు స్పందిస్తూ, నగరంలో ప్రపంచ స్థాయి ‘ఒలింపిక్ స్పోర్ట్స్ అకాడమీ’ని ఏర్పాటు చేసే ప్రణాళికలను ఆధవ్ అర్జున ప్రకటించారు.

ప్రస్తుతం స్థల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందని, తగిన స్థలాల కోసం సూచనలు ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. తిరునెల్వేలి, రామనాథపురం, కన్యాకుమారి, శివగంగ జిల్లాలకు ప్రత్యేక క్రీడా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అలాగే పరమకుడిలో ‘ఒలింపిక్ సిటీ’ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *