భవిష్యత్తు కార్యాచరణపై కొండా సురేఖ ఫోకస్
వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కాకా రేపుతోంది. ఆమె దేశ రాజధాని వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకోవాలని అనుకుంటే ముందుగా సీఎంపై తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎందుకంటే ఇంకా సర్కార్ కాల పరిమితి ఉన్నప్పటికీ తాను టికెట్లు కేటాయిస్తానంటూ ఓరుగల్లు జిల్లా వేదికగా జరిగిన సభలో ఎలా రేవంత్ రెడ్డి ప్రకటిస్తాడని ప్రశ్నించారు. ముందుగా తనపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తను పద్మశాలి సామాజిక వర్గానికి చెందగా తన భర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజిక కులానికి చెందిన వ్యక్తి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ ఉద్యమం ఊపందుకుంది. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి.
ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డుతో ముందుకు వెళ్లాలని అనుకుంటోంది. ఇదిలా ఉండగా తాజా పరిణామాలపై గురువారం వరంగల్ జిల్లా నేతలతో ఓరుగల్లులో ప్రత్యేకంగా కొండా సురేఖ భేటీ అయ్యారు. ఆమె సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఢిల్లీలో నిన్న జరిగిన పరిణామాలపై అనుచరులతో చర్చించారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తన వాదనలను వినిపించారు కొండా సురేఖ. ‘నేనా లేక సురేఖనా… అనేది స్పష్టంగా తేల్చుకోండి’ అని హైకమాండ్‌కు రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.మంత్రి పదవితో పాటు పార్టీని కూడా వీడే యోచనలో సురేఖ ఉన్నారా? అనేది జోరుగా ప్రచారం జరుగుతోంది.