7 నుండి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ పంపిణీ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. టీటీడీ తాత్కాలిక చైర్మన్, ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర టీటీడీ ఆధ్వర్యం లోని వివిధ విభాగాలలో విశిష్ట సేవలు అందించి, పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఇందులో భాగంగా నవంబరు 7 నుండి 20వ తేదీ వరకు టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు ఈవో.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని ఎల్లుండి శనివారం రోజు నుంచి పంపిణీ చేయడం ప్రారంభిస్తామన్నారు. ఇది 20వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు ఈవో. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. పింఛన్‌దార్లు తమ స్మార్టు కార్డు చూపి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ పొందవచ్చు అని తెలిపారు.
పిపిఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. నవంబరు 7న 164 నుండి 3,250 వరకు, నవంబరు 9 నుండి 13వ తేదీ వరకు 3,251 నుండి 9,050 వరకు, నవంబరు 16 నుండి 19వ తేదీ వరకు 9,051 నుండి 12,550 వరకు, నవంబరు 20న 12,551 నుండి మిగిలిన పింఛన్‌దారులందరికీ ప్రసాదాలు అందచేయనున్నట్లు పేర్కొన్నారు ముద్దాడ రవిచంద్ర. విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరారు.