Saturday, 14 November 2026

యువత రాజకీయాల్లోకి రావాలి : నారా లోకేష్

newsseals-NaraLokesh

విశాఖ‌ప‌ట్నం : దేశ భ‌విష్య‌త్తు యువ‌త చేతుల్లోనే ఉంద‌న్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో యవతకు మంచి అవకాశాలున్నాయని అన్నారు. విశాఖ మేయర్‌తో పాటు పలువురు యువ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు బాధ్యతలు ఇటీవల ఎన్నికయ్యారని చెప్పారు. 25 మంది మంత్రుల్లో 17 మంది యువకులే ఉన్నార‌ని తెలిపారు. విదేశాల నుంచి తిరిగొచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్‌ ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. వ్యవస్థలో లోపాలున్నాయని విమర్శించడం కాదు, వాటికి పరిష్కారాలు చూపించే ప్రక్రియలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నారా లోకేష్. సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత అధికారులు, సంస్థలు, ప్రజా ప్రతినిధులను కలుస్తూ పట్టుదలతో పని చేయాలని కోరారు. పెద్ద కలలు కనడంతో పాటు వాటిని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించడం, ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పని చేయడం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని చెప్పారు.

సినిమా, సంగీతం, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో యువతకు శిక్షణ అందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం అన్నారు. సంగీత దర్శకులు, సినిమా రంగంలోని అనుభవజ్ఞులతో కలిసి యువతకు శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తాం అని తెలిపారు. సంగీత శిక్షణ కోసం థమన్‌తో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామ‌న్నారు. తిరుపతి లోనూ ఇందుకోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ సహా వివిధ విభాగాల్లో నిపుణుల అనుభవాన్ని యువతకు అందించాలన్నది మా ఆలోచన. దీనికి కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆధునిక సాంకేతికతను జోడిస్తాం అన్నారు. తద్వారా వినోద రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తాం. యువతలో ఏదో ఒకటి సాధించాలనే బలమైన తపన ఉండాలి, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని మంత్రి లోకేష్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *