హైదరాబాద్ : రిటైర్ అయిన ఉద్యోగుల ప్రయోజనాలపై 10% వడ్డీని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు . ప్రయోజనాల చెల్లింపులో జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. కామారెడ్డిలో ఎస్‌ఐగా పనిచేసి 2024 డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన బేతి కోనారెడ్డి ఏడాది గడిచినా తనకు అందాల్సిన ప్రయోజనాలు అందక పోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 23న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి, నాలుగు వారాల్లోగా ప్రయోజనాలను చెల్లించాలని, లేని పక్షంలో పదవీ విరమణ చేసిన తేదీ నుండి 10% వడ్డీని చెల్లించాలని ఆదేశించారు
కోర్టు ఆదేశాలు జారీ చేసి ఆరు వారాలు గడిచినా ప్రయోజనాలు చెల్లించలేదని పేర్కొంటూ సదరు ఉద్యోగి కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆరు వారాల గడువు ముగిసిన తర్వాత కేవలం అసలు ప్రయోజనాలను మాత్రమే చెల్లించారని, వడ్డీని చెల్లించ లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 23 నెలలకు సంబంధించి 10% వడ్డీని ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించగా, ప్రభుత్వ తరపు న్యాయవాది మరికొంత సమయం కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, కేసు విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది. అప్పటి లోపు వడ్డీని చెల్లించక పోతే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ సుల్తానియా స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.




