హైదరాబాద్ : కొన్ని రోజుల చలి తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అక్వాన్ తుఫాను కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 20 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) అంచనా వేసింది. ఐంఎడీ ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మెరుపులు, బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుఫాను వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతున్నందున నవంబర్ 21, 22 తేదీల మధ్య నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐంఎడీ. ఈ వాతావరణ వ్యవస్థ నవంబర్ 16 లేదా 17 తేదీలలో బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఇది 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదలవచ్చు. అయితే, దాని కచ్చితమైన మార్గం మరియు తీవ్రత మారవచ్చు.
ఇదిలా ఉండగా వాతావరణ అప్‌డేట్‌లను అనుసరించాలని, స్థానిక హెచ్చరికల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) ప్రజలకు సూచించింది. వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లోని రైతులు కూడా కోత కోసిన పంటలను కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రోజుల పొడి వాతావరణం, చల్లని ఉదయాల తర్వాత, ఈ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులలో మార్పును తీసుకు వస్తాయని అంచనా.




