Tuesday, 17 November 2026
Trending

చెరువుల బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు

newsseals-HYDRAA

హైద‌రాబాద్ : చెరువులు, కాలువల (నాలాల) బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్ట కూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని ఎవరూ పట్టించు కోవడం లేదు. మొదట బఫర్ జోన్‌లో పనులు మొదలుపెట్టి, ఆ తర్వాత చెరువు పూర్తి నీటి మట్టం పరిధిలోకి చొరబడి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఇలా అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హైడ్రా ఏర్పడిన తర్వాత ఇటువంటి అక్రమాలు తగ్గినప్పటికీ, భవిష్యత్తులో ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా, చెరువుల సరిహద్దులను ,బఫర్ జోన్లను స్పష్టంగా గుర్తించేలా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైడ్రా ‘ప్రజావాణి’లో పలువురు ఫిర్యాదుదారులు కోరారు. వరద నీటి కాలువలను కూడా వదలకుండా ఆక్రమించడం వల్ల, తాము నివసించే ప్రాంతాలు వరద ముప్పుకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రోడ్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రామయ్యనగర్‌లో ఒక డెడ్-ఎండ్ రోడ్డును వేదికగా (ప్లాట్‌ఫారమ్‌గా) మార్చేశారని, దీనివల్ల ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని వారు ఫిర్యాదు చేశారు. ‘ప్రజావాణి’లో మొత్తం 54 ఫిర్యాదులు అందాయి. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గూగుల్ శాటిలైట్ చిత్రాలను చూసి సమస్యలను పరిష్కరించే బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పగించారు.

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అన్నోజిగూడకు చెందిన నివాసితులు, సర్వే నంబర్ 87లో ఉన్న 4.20 ఎకరాల చెరువును కాపాడాలని ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు. చెరువు పక్కన నిర్మాణాలు జరుగుతున్నాయని సరిహద్దులను గుర్తించి పరిరక్షించాలని కోరారు. అదే ప్రాంతంలోని సర్వే నంబర్లు 90, 91లలో ఉన్న సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం,ముత్తంగి గ్రామం శివారులోని సర్వే నంబర్లు 230, 231లలో ఉన్న ‘నక్కవాగు’ కాలువ (నాలా) సుమారు 1.17 ఎకరాల మేర ఆక్రమణకు గురవుతోందని తెలిపారు. సమీపంలోని 4.07 ఎకరాల ప్రభుత్వ భూమిలో లేఅవుట్‌ను అభివృద్ధి చేసి, ప్లాట్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే నక్కవాగు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కప్ర సర్కిల్ శ్రీ సాయి ఎన్‌క్లేవ్‌లో ఒక కాలువ (నాలా)పై ఆలయాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నాయి. వర్షాకాలంలో ఈసీఐఎల్ (ECIL) ప్రాంతం గుండా భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఒకవేళ ఈ కాలువ ఆక్రమణకు గురైతే, శ్రీ సాయి ఎన్‌క్లేవ్ కాలనీతో పాటు చుట్టుపక్కల నివాస ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి, ఆలయ విస్తరణ పనులను వెంటనే నిలిపి వేయాలని, కాలువ ఆక్రమణను అడ్డుకోవాలని ‘శ్రీ సాయి కృష్ణ వెల్ఫేర్ సొసైటీ’ సభ్యులు ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ జోన్, ఘట్‌కేసర్ సర్కిల్, రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 281లో ఉన్న ఒక పెద్ద చెరువుకు సంబంధించిన బఫర్ జోన్‌లో భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయ‌ని, ఈ నిర్మాణాలను నిలిపివేసి చెరువు బఫర్ జోన్‌ను కాపాడాలని స్థానికులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *