Tuesday, 17 November 2026
Trending

ప్రత్యేక పైప్‌లైన్‌ల ద్వారా శుద్ది చేసిన నీరు స‌ర‌ఫ‌రా

newsseals-HMWSSB

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని విస్తరించడానికి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సరఫరాను పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగోల్ , పటేల్ చెరువు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను సందర్శించారు. అధికారులతో శుద్ధి చేసిన నీటి సరఫరా, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల కార్యకలాపాలు , నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగంపై సమీక్షించారు. ఎండీ మొదట నాగోల్ ఎస్టీపీని సందర్శించారు. అక్కడి గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. బోర్డుకు చెందిన ఎయిర్‌టెక్ యంత్రం పనితీరు, శుద్ధి చేసిన నీటి వినియోగం గురించి ఆయన ఆపరేటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిబ్బంది తాగడానికి, చేతులు కడుక్కోవడానికి, ఇతర వ్యక్తిగత పరిశుభ్రత అవసరాల కోసం ప్రత్యేక నీటి క్యాన్‌లను అందించాలని ఆదేశించారు.

ఎస్టీపీలను వాటి సామర్థ్యానికి తక్కువగా నడప వద్దని, అందుబాటులో ఉన్న శుద్ధి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించు కోవాలని ఎండీ కోరారు . ఆ తర్వాత ఎండీ పటేల్ చెరువు ఎస్టీపీని సందర్శించారు. అక్కడ శుద్ధి ప్రక్రియను, గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ పనితీరును తనిఖీ చేశారు. శుద్ధి చేసిన నీటి లభ్యత, ట్యాంకర్ సరఫరా వ్యవస్థ, కార్యాచరణ ఏర్పాట్ల గురించి ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. ఆ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపడుతున్న కంపెనీలు గ్రీన్ వాటర్ ట్యాంకర్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పటేల్ చెరువు మురుగునీటి శుద్ధి కర్మాగారం నుండి శుద్ధి చేసిన నీటితో నింపిన ఆకుపచ్చ రంగు ట్యాంకర్ నిర్మాణ స్థలానికి చేరుకుంది. ఎండీ అశోక్ రెడ్డి ఎమ్మెల్యేతో కలిసి ట్యాంకర్‌లో అక్కడికి వెళ్లారు. నిర్మాణ పనులలో శుద్ధి చేసిన నీటి వినియోగంపై కంపెనీ యాజమాన్యంతో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *