హైదరాబాద్ : టీచర్ల సెలవులకు సంబంధించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. ఆమె తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థుల హాజరు 95% దాటితేనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయాలని జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. అది కూడా అదనపు కలెక్టర్ ద్వారా మాత్రమే సెలవు పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేయడం పట్ల భగ్గుమన్నారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అధికారులు తమ సెలవులను అదనపు కలెక్టర్ ద్వారానే ఆమోదింప జేసుకోవాలని విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు 95% దాటితేనే సెలవు మంజూరు చేయబడుతుందని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 672 ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 6,200 మంది ఉపాధ్యాయులు ఈ ఉత్తర్వులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో వివిధ రాష్ట్రాల విద్యార్థులు చదువుకుంటారని, ఇక్కడ రకరకాల పండుగలు జరుగుతాయని, ఒకరిద్దరు విద్యార్థులు తరచుగా పాఠశాలకు గైర్హాజరైనా 95% హాజరు సాధించడం కష్టమని మండి పడుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అదనపు కలెక్టర్‌ను కలిసి, సెలవు మంజూరు కోసం లీవ్ లెటర్ సమర్పించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులను తక్షణమే ఉప సంహరించు కోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.




