అమరావతి : డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఆధారిత నిర్ణయాలు , వినూత్న మార్కెటింగ్ వ్యూహాలను సమర్థవంతంగా ఉపయోగించు కోవడం ద్వారా వ్యాపారాలను వేగంగా విస్తరించవచ్చని క్రీడా నిపుణుడు , కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన ‘BNI ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్కింగ్ కాంక్లేవ్ 4.0’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన 1,500 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి గోపీచంద్ ప్రసంగించారు. వ్యాపారంలో దీర్ఘకాలిక విజయానికి సహకారం, నమ్మకం , బలమైన వృత్తిపరమైన సంబంధాలు పునాదులని ఆయన నొక్కి చెప్పారు. జీవితంలోనైనా లేదా వ్యాపారంలోనైనా… గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవడం, క్రమబద్ధమైన ప్రణాళికతో వాటిని సాధించడానికి కృషి చేయడం ద్వారానే విజయం మొదలవుతుందని ఆయన అన్నారు. అయితే, వేగంగా మారుతున్న వ్యాపార వాతావరణంలో, కేవలం ఎక్కువ గంటలు పని చేయడం కంటే పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, తెలివిగా (స్మార్ట్‌గా) పని చేయాలని పుల్లెల గోపీచంద్ సూచించారు.
అలాగే, మారుతున్న మార్కెట్ పోకడలకు అనుగుణంగా తమను తాము మలుచు కోవాలని, ఆవిష్కరణలను స్వీకరించాలని ఆయన కోరారు. డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఆధారిత నిర్ణయాలు , వినూత్న మార్కెటింగ్ వ్యూహాలను సమర్థవంతంగా ఉపయోగించు కోవడం ద్వారా వ్యాపారాలను వేగంగా విస్తరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి పోటీ ప్రపంచంలో ‘స్మార్ట్’ పద్ధతుల ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవడమే విజయానికి కీలక సూత్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తూ, కేవలం ఒక ఉత్పత్తి లేదా సేవ మాత్రమే దీర్ఘకాలిక విజయానికి హామీ ఇవ్వలేవని ఆయన అన్నారు. సుస్థిరమైన సంస్థలను నిర్మించడంలో నమ్మకం, వినియోగదారులతో సంబంధాలు, ప్రజా సంబంధాలు , తోటి పారిశ్రామికవేత్తలతో సహకారం ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. పోటీని శత్రుత్వంగా భావించకుండా, నేర్చుకునే అవకాశంగా చూడాలని ఆయన సూచించారు.







