ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి
న్యూఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ప్లే ఆఫ్స్ రేసు లో నిలిచేందుకు జరిగిన కీలక మ్యాచ్ లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్బుత విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి రాజస్తాన్ రాయల్స్ ను మట్టి కరిపించింది. ప్రధానంగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతులతో రఫ్పాడించాడు. ఒకానొక దశలో హ్యాట్రిక్ మిస్సయ్యాడు . ముందుగా బ్యాటింగ్ చేసింది రాజస్తాన్ రాయల్స్ . నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. అభిషేక్ పోరేల్, కేఎల్ రాహుల్ ఇద్దరూ 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు.
ఇక రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు చెత్త ఫీల్డింగ్ తో నిరాశ పరిచారు. పదే పదే ఫీల్డింగ్‌లో తప్పులు చేస్తూ, పేలవమైన త్రోల ద్వారా ప్రత్యర్థికి పరుగులు సమర్పించారు. ఈ సమయంలోనే జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఒక సులభమైన బంతిని చేజార్చాడు. దీనితో బ్యాట్స్‌మెన్ ఆ బంతికి మూడు పరుగులు చేశారు. ఆ క్షణంలో జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. డ్రెస్సింగ్ రూమ్ నుండే రియాన్ పరాగ్ పై గట్టిగా అరుస్తూ ఆయన కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.





