4 ఓవర్లు 33 రన్స్ 3 కీలక వికెట్లు
లక్నో : ఐపీఎల్ 19వ లీగ్ సీజన్ మరింత రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో ఇప్పటికే మూడు జట్లు చేరుకున్నాయి. ఒకే ఒక్క స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే విజయాలతో దూసుకు పోతున్న ఆర్సీబీకి ఝలక్ ఇచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 19.2 ఓవర్లలో 213 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ 209 పరుగులు చేసింది ఆరు వికెట్లు కోల్పోయి. దీంతో లక్నో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ జట్టుకు ఇది ఆరు అపజయాల తర్వాత దక్కిన విజయం.
ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్. అద్భుతమైన బౌలింగ్ పర్ ఫార్మెన్స్ తో ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తను 4 ఓవర్లు వేసి 33 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లను కూల్చాడు. ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. షమీ, ప్రిన్స్ ఆరంభ ఓవర్లలో విజృంభించడంతో బెంగళూరు మొదటి 8 బంతుల్లోనే బెతెల్ (4), కోహ్లీ (0) వికెట్లను కోల్పోయింది. 9 రన్స్కే ఓపెనర్లను నష్ట పోయిన ఆర్సీబీని పడిక్కల్, రజత్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపించారు.






