చెన్నై : సీఎం విజయ్ సారథ్యంలోని తమిళనాడు సర్కార్ మహిళా సంఘాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పనిచేసే ‘తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థ’ (Tamil Nadu Corporation for Development of Women) ఆధ్వర్యంలో ఈరోడ్ జిల్లాలోని పెరుందురైలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,000 మహిళా స్వయం సహాయక బృందాలకు (SHGs) పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా రూ. 3,000 కోట్ల విలువైన బ్యాంక్ రుణ అనుసంధాన (bank credit linkage) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా, 9,000 మహిళా స్వయం సహాయక బృందాలకు రూ. 1,110 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.
అంతే కాకుండా వివిధ రకాల జీవనోపాధి ఆర్థిక సహాయాలను, యువత కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుమతి పత్రాలను, మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేక విక్రయ కేంద్రాలను (sales outlets) ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతి పత్రాలను కూడా ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో ముచ్చటించారు. వారు తయారు చేసిన ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు సీఎం జోసెఫ్ విజయ్. ఎన్నికల సందర్బంగా తాము ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తమ సర్కార్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.




