Wednesday, 4 November 2026

అగ్రి యాప్‌తో విస్తృత ప్రయోజనాలు : సీఎం

newsseals-AgriApp

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులు ఉంటే.. 20 లక్షల మంది అగ్రి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. 10 లక్షల మంది నిత్యం వినియోగిస్తున్నారని తెలిపారు. యాప్ ద్వారా అన్నిరకాల సేవలు అందుతున్నాయ‌ని చెప్పారు. దీనిని మరింత వినియోగించు కోవాలని కోరారు. యాప్‌ ఆధారంగానే పంటల రుణాలు అందించే విధానం ఉండాలన్నారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలన్నింటినీ అగ్రి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులపై గురుతర బాధ్యత ఉందని స్ప‌ష్టం చేశారు ఎన్నికలు ఉన్నప్పటికీ రైతులకు సంబంధించిన ఈ పనులపైనే దృష్టి సారిస్తున్నాం అన్నారు సీఎం. నమ్ముకున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు అద్భుతంగా పని చేస్తున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు. బీమా విషయంలోనూ సమర్ధత చాటుకోవాలి అని సీఎం సూచించారు. పంటల బీమా అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. మొత్తం 30,286 సీసీఈ (Crop Cutting Experiments – CCEs) లు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు సీఎం. వీటిని నవంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుక‌కు రావాలన్నారు. రాష్ట్రంలో రెండేళ్లకోసారి, కొన్నిసార్లు ఐదేళ్లకోసారి తుఫాన్లు సంభవిస్తున్నాయని తెలిపారు సీఎం. వీటి కారణంగా రైతులు పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి పొందలేక పోతున్నారని వాపోయారు. రైతులకు పెట్టుబడి తిరిగి వచ్చేలా భరోసా కల్పిస్తే నష్టాల నుంచి బయట పడగలుగుతారని చెప్పారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమాను సమన్వయం చేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందన్నారు. రైతుల్లో పంటల బీమాపై అవగాహన, ఆమోదం కల్పించగలిగితే వారు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకొస్తారని తెలిపారు. తద్వారా వారికి ఆర్థిక భద్రత కలుగు తుందన్నారు. ఈ నెలలోనే అన్ని అవగాహన కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తున్న రూ.20,000 ఎంతలా ఉపయోగ పడుతుందో… బీమా కూడా రైతును ఆదుకోవడంలో దోహద పడుతుంది అని ముఖ్యమంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *