Wednesday, 4 November 2026

యుద్ద ప్రాతిప‌దిక‌న ఉస్మాన్ సాగ‌ర్ మ‌రమ్మ‌త్తు ప‌నులు

newsseals-HMWSSB

హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి ఉస్మాన్ సాగర్ నుండి తాగునీటిని సరఫరా చేసే శతాబ్దం నాటి రాతి కండ్యూట్‌కు ఏర్పడిన లీకేజీలను సరిచేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. సబ్జా కాలనీ, టోలీచౌకీ, మాణికొండ వంటి ప్రాంతాల్లో తలెత్తిన లీకేజీలను అరికట్టేందుకు, మంగళవారం ఉదయం 6 గంటల నుండి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు, అంటే 36 గంటల పాటు నీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్లు వాటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, 20 MGD సామర్థ్యం కలిగిన ఈ కండ్యూట్ వద్ద మరమ్మతు పనులను అధికారులు వేగవంతం చేశారు. నిర్ణీత సమయం కంటే ముందే పనులను పూర్తి చేసి ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా వాటర్ బోర్డు ఎండీ కె. అశోక్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. కండ్యూట్ శతాబ్దం నాటిది కావడంతో, మరమ్మతుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు మళ్లీ రాకుండా, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ శాశ్వత పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరా నిలిచి పోయిన ప్రాంతాల్లో, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

నగరానికి వివిధ వనరుల ద్వారా రోజుకు సుమారు 560 MGD తాగునీరు సరఫరా అవుతుండగా, ప్రస్తుత షట్‌డౌన్ కేవల గండిపేటకు సంబంధించిన 20 MGD కండ్యూట్‌కు మాత్రమే పరిమితమని వాటర్ బోర్డు స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి, సింగూరు-మంజీర , ఇతర వనరుల నుండి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. మరమ్మతు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వాటర్ బోర్డు వెల్లడించింది. అప్పటి వరకు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని వినియోగదారులను కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *