Friday, 20 November 2026

ఖ‌మ్మం ఖిల్లాలో క‌దం తొక్కిన క‌లాలు, గ‌ళాలు

newsseals-JournalistsProtest

ఖమ్మం జిల్లా : ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు ఇంటి జాగా రాకుండా చేస్తారా? మా భూమి మాకు ఇవ్వండి. గత ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం పొంది ఖమ్మం జర్నలిస్టులకు 23.2 ఎకరాల భూమిని కేటాయించింది. వాటిని జర్నలిస్టులకు పంచకుండా మూడేళ్ల పాటు కాలయాపన చేయటం ఏమిటని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూ జె (టిజెఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్ లోనే అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత ప్రెస్ క్లబ్ నుంచి జర్నలిస్టులో బైక్ ర్యాలీగా కార్యాలయానికి చేరుకున్నారు .అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా టియుడబ్ల్యూ జె (టిజెఎఫ్) జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రాజకీయాలతో జర్నలిస్టులకు ఎటువంటి సంబంధాలు లేవ‌న్నారు. కానీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని అమలు చేయమని అనేక రూపాలలో విజ్ఞప్తులు చేశామన్నారు. కానీ పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల బతుకులు మాత్రం మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం పొంది ఖమ్మం జర్నలిస్టులకు 23.2 ఎకరాల భూమిని కేటాయిస్తూ 147 జీవోను విడుదల చేసిందన్నారు. ఆ భూమిని ప్లాట్లుగా విభజించి అర్హులైన జర్నలిస్టులకు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ఆ భూమిని జర్నలిస్టులకు బదలాయింపు చేయకుండా ఈ ప్రభుత్వం మూడేళ్ల పాటు కాలయాపన చేస్తూ జర్నలిస్టుల జీవితాలతో ఆటలాడుతుందని మండిపడ్డారు.

ఇంకా ఎంత కాలం చూడాలి..? ఇంకా ఎంతమంది చనిపోవాలి అని ప్ర‌శ్నించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 18 మంది జర్నలిస్టులు చనిపోయారని వాపోయారు. వారి ఆశయాలు వారి కుటుంబ సభ్యుల ఆకాంక్ష నెరవేరకుండానే జర్నలిస్టులు చనిపోతుంటే ఇంకా ఎంతకాలం చూడాలని ఆవేదన వెల్లుబుచ్చారు. మా భూమి మాకు ఇవ్వండి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ.. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఖమ్మం పర్యటనకు వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *