Saturday, 21 November 2026

ధ‌ర‌ల సునామీ రాబోతోంది జ‌ర భ‌ద్రం

newsseals-KethireddyVenktarmiReddy

అనంత‌పురం జిల్లా : వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కొండెక్కి కూర్చున్నాయ‌ని పేర్కొన్నారు. ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. అక్టోబరు నెలలో దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) 12.29 శాతానికి పెరిగిందని, అదే సమయంలో ఇంధనం , విద్యుత్ ధరలు ఏకంగా 32.84 శాతం పెరిగాయ‌ని దీని ప్ర‌భావం నిత్య‌వ‌సారాల‌పై ప‌డుతుంద‌న్నారు మాజీ ఎమ్మెల్యే. రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరుకుని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన పరిమితిని దాటిందన్నారు..ఆహార పదార్థాల ధరల పెరుగుదలలో భారతదేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 13.23 శాతంతో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు .

ఇప్పుడు టోకు ధరలు 12 శాతాన్ని దాటాయని అంటే, రాబోయే నెలల్లో ధరల భారం మరింత పెరగబోతోంద‌ని , జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు కేతిరెడ్డి. ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త స్టీవ్ హాంకే హెచ్చరిస్తున్నట్లుగా ధరలపై RBI తన నియంత్రణను కోల్పోయిందని ఇది రాబోయే ప‌త‌నానికి నాంది గా భావించాల్సి ఉంటుంద‌న్నారు. త‌ను సూచించిన లెక్క‌ల ప్ర‌కారం భారతదేశంలో ద్రవ్య సరఫరా (M3) ఏటా 17.6 శాతం చొప్పున పెరుగుతోందని, కానీ ధ‌ర‌లు అదుపులో ఉండాలంటే ఈ వృద్ది కేవ‌లం 10 శాతం మాత్ర‌మే ఉండాల‌న్నారు.

సరళంగా చెప్పాలంటే, మార్కెట్లో ఉన్న వస్తువుల కంటే డబ్బు సరఫరా వేగంగా పెరిగినప్పుడు, అదే వస్తువు కోసం మనం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ధరలు పెరుగుతాయి, మన చేతిలో ఉన్న రూపాయి విలువ పడిపోతుందన్నారు కేతిరెడ్డి. ఇక‌నైనా కూట‌మి స‌ర్కార్ ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *