హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్కులో మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అక్కడ నడుస్తున్న ప్రజలతో ఆయన ముచ్చటించారు. 3 ఎకరాలకు కుంచించుకు పోయి, మురుగునీటి గుంటగా మారిన చెరువును, 12 ఎకరాలకు విస్తరించి పునరుద్ధరించే అంశంపై చర్చించారు. వరద నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్‌లెట్లను (నీరు వచ్చే మార్గాలను) అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల సమయంలో జూబ్లీహిల్స్, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే భారీ వరద నీటిని కృష్ణకాంత్ పార్కు చెరువులోకి మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్, అమీర్‌పేట , మైత్రీ వనం వంటి చుట్టుపక్కల ప్రాంతాలు వరద ముంపునకు గురికాకుండా ఉంటాయని వివరించారు. వరద నీటిని నిల్వ ఉంచేందుకు వీలుగా చెరువును లోతు చేసే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. చెరువు అభివృద్ధికి సంబంధించి అక్కడి ప్రజల నుంచి ఆయన సూచనలను స్వీకరించారు.
ఈ సందర్శనలో స్థానిక నివాసితులు, పార్కుకు వచ్చిన సందర్శకులు, కృష్ణకాంత్ పార్కులో తాము ఎదుర్కొంటున్న సమస్యలను హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పార్కుకు దక్షిణ వైపున చెత్తా చెదారం పడేసే ప్రదేశం (డంపింగ్ యార్డ్) ఉందని, అక్కడ ప్రహరీ గోడ లేక పోవడం వల్ల దుర్వాసన, చెత్త పార్కులోకి వస్తున్నాయని వారు తెలిపారు. జిమ్ పరికరాలు పాడై పోయాయని, వాటిని బాగు చేయడంతో పాటు మరిన్ని కొత్త పరికరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల ‘తమ్మిడి కుంట’ వద్ద హైడ్రా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ చాలా బాగుందని, అదే తరహా సదుపాయాన్ని ఇక్కడ కూడా కల్పించాలని వారు విన్నవించారు. చెరువుతో పాటు పార్కును కూడా అభివృద్ధి చేయాలని కోరారు .




