ఆఫ్గనిస్తాన్ : పాకిస్తాన్ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేసింది ఆఫ్గనిస్తాన్ సర్కార్. సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా పోరాడుతున్న సాయుధ సమూహాలకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని తాలిబన్ పాలకులు ఆరోపించారు. జర్మన్ ప్రసార సంస్థ ‘డ్యుయిష్ వెల్లె’ (DW) ప్రచురించిన “ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ వ్యతిరేక సమూహాలకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందా?” అనే నివేదికలో ఈ అంశం పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ పాలన, తమకు వ్యతిరేకంగా ఉన్న సాయుధ సమూహాలకు పాకిస్థాన్ అండగా నిలుస్తోందని ఆరోపించింది. ఇరు దేశాల సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సాయుధ శక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా, ఆఫ్ఘనిస్థాన్‌లో అస్థిరతను సృష్టించేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోందని తాలిబన్లు పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్ ఈ ఆరోపణలను కేవలం ప్రచారంగా కొట్టి పారేసింది. మరోవైపు పాకిస్థాన్ నిజంగా ఎంతవరకు మద్దతు ఇస్తోందనే విషయంలో విశ్లేషకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ మాట్లాడుతూ పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌ను అస్థిరపరిచే ప్రాజెక్టును” చేపట్టిందని విమర్శించారు. తాలిబన్ పాలనలో నెలకొన్న స్థిరత్వాన్ని దెబ్బ తీసేందుకు, వివాదాస్పద ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు అయిన ‘డ్యూరాండ్ లైన్’ వెంబడి వేలాది మంది సాయుధులు గుమిగూడారని ఆయన ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ఆఫ్ఘన్ తాలిబన్ దళాలకు, పాకిస్థాన్ భద్రతా సిబ్బందికి మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, సాయుధ ఘర్షణలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఈ ఆరోపణలు వెలువడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని వివిధ ప్రావిన్సుల్లో జరిగిన దాడులకు తామే బాధ్యులమని పలు తాలిబన్ వ్యతిరేక సమూహాలు ప్రకటించుకున్నాయి. జూలై నెలలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘ఆఫ్ఘనిస్థాన్ ఫ్రీడమ్ ఫ్రంట్’ (AFF) అనే సాయుధ సమూహం, ఈశాన్య బదఖ్షాన్ ప్రావిన్స్‌లోని జెబాక్ జిల్లాలో తాలిబన్ దళాలతో ఘర్షణకు దిగింది. అంతే కాకుండా అక్టోబర్‌లో నూరిస్థాన్ , కునార్ ప్రావిన్సుల్లో కూడా తామే దాడులు చేశామని ఈ సమూహం పేర్కొంది.




