హైదరాబాద్ : ఆకాశంలో ఒక తార మూవీలో తళుక్కున మెరిసింది సాత్విక వీరవల్లి. తను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమెరికాలో ఆ జాబ్ ను వదిలేసింది. కేవలం సినిమాపై మక్కువతో తొలిసారి మూవీలో నటించింది. ప్రేక్షకుల హృదయాలపై తన నటనతో ముద్ర వేసింది. ఇందులో మరో ముఖ్య పాత్ర పోషించాడు విలక్షణ నటనకు పేరు పొందిన దుల్కర్ సల్మాన్. అయితే సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి సినీ రంగంలోకి అడుగుపెట్టిన యువ నటి సాత్విక వీరవల్లి ప్రయాణం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. తన వయసు 26 ఏళ్లు. తెలుగు, తమిళ సంప్రదాయాలు కలగలిసిన కుటుంబం ఆమెది. తండ్రి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామం. తల్లి చికాగోలో భరతనాట్యం నేర్పించారు. అమెరికాలో పెరిగినప్పటికీ భారతీయ సంస్కృతి, సంగీతం, నృత్యంతో సాత్వికకు చిన్నప్పటి నుంచే అనుబంధం ఉంది.
ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసిన సాత్విక వీరవల్లి ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీ ఒరాకిల్ లో పని చేశారు. హెల్త్‌కేర్ టెక్నాలజీ, డేటా ఇంటిగ్రేషన్ ప్రాజెక్టుల్లో అనుభవం ఉంది. సుమారు రెండేళ్లు ఇంజనీర్‌గా పనిచేసిన తర్వాత తనకు సృజనాత్మక రంగంలో పని చేయాలనే కోరిక ఎక్కువగా ఉందని గుర్తించారు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి నటనను కెరీర్‌గా ఎంచుకున్నారు. సాత్విక సినీ ప్రయాణం అనుకోకుండా ప్రారంభమైంది. సోషల్ మీడియాలో పెట్టిన ఒక Instagram వీడియో నిర్మాత దృష్టిని ఆకర్షించింది. దుల్కర్ సల్మాన్ నటించిన తమిళ చిత్రం ‘కాంత’ కోసం ఆడిషన్‌కు పిలిచారు . ఆ సినిమాలో అవకాశం రాలేదు.ఆమె ఆడిషన్ వీడియోను దర్శకుడు పవన్ సాధినేనికి చూపించారు. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో కథానాయిక పాత్రకు మరోసారి ఆడిషన్ నిర్వహించారు. ఆడిషన్‌లో ఎంపికై హీరోయిన్‌గా అవకాశం పొందారు.




