అమరావతి : గ్రామాభివృద్దికి ఉపయోగపడేలా పంచాయతీల్లో ఏకగ్రీవాలను పోత్సహించాలని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆదివారం పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు, పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాలపై మంత్రులతో చర్చించారు. మంత్రులతో చర్చలో పంచాయతీల్లో ఏకగ్రీవాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకగ్రీవాలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అంది పుచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయని పేర్కొన్నారు. మునిసిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం రెండున్నరేళ్ల పాలనకు దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు.
కూటమితోనే ప్రజలు ఉన్నారని అర్థమైందన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు కూటమి పాలనకు దక్కిన ఆమోదం లభించిందన్నారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని చాటిందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఏకపక్షంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గొడ్డలి పార్టీ జీర్ణించు కోలేక పోతోందన్నారు. అందుకే ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి కనిపించాలన్నారు..ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఓట్లుగా మలుచు కోవాలని కోరారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే తీర్పు వచ్చిన నేపథ్యంలో… పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలన్నారు.




