అమరావతి : ఏపీ రాష్ట్ర హొం , పర్యావరణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మురసు తుపాను తీవ్రతపై ప్రజలను హెచ్చరించారు. రానున్న 48 గంటల పాటు అధికార యంత్రాంగం హై అలర్ట్‌లో ఉండాలని హోం మంత్రి స్పష్టం చేశారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయాన్ని వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సమన్వయంతో తుపాను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని మంత్రి తెలిపారు .ప్రజలు అధికారికంగా జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు వంగలపూడి అనిత. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే నిర్ధారణ లేని సమాచారాన్ని, వదంతులను నమ్మవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. తుపాను సంబంధిత సమస్యలపై తక్షణ సహాయం కోసం మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా సంప్రదించ వచ్చని తెలిపారు. అత్యవసర సహాయం అవసరమైన వారు విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన 112, 1070, 18004250101 నంబర్లకు ఫోన్ చేయాలని హోం మంత్రి అనిత సూచించారు. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని, తుపాను ప్రభావం తగ్గే వరకు అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పని చేయాలని స్పష్టం చేశారు.




