కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ అరంగేట్రంపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆయన జాతీయ పార్టీలో చేరనున్నారనే నెట్టింట జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ధనుష్‌కు భాజపా మద్దతు ఉందంటూ వినిపిస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. నేను ఒంటరిగానే ఉన్నా. నా వెనుక ఎవరూ లేరు. అదంతా పుకార్లు తప్ప మరోటి కాదన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇదంతా అబద్దం. నన్ను నడిపించే శక్తి ఒకే ఒక్కరికి మాత్రమే ఉంది. అది ఆ దేవుడు మాత్రమేనని పేర్కొన్నారు ధనుష్. ఇదిలా ఉండగా విద్యార్థుల కోసం ఈ సంవత్సరం 4 ఉచిత ఏసీ ట్యూషన్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో ఈ ట్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించడమే తన లక్ష్యమని ధనుష్ ప్రకటించారు. దీనిని మొదటగా చెన్నైలో 3 సెంటర్లు, కన్యాకుమారిలో 2 సెంటర్లతో ప్రారంభించబోతున్నట్లు ధనుష్ చెప్పారు.
అంతేకాకుండా తాను ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి, తప్పుగా మాట్లాడటానికి కొందరు సిద్ధంగా ఉంటున్నారని పేర్కొన్నారు . అయితే ఈ సేవా కార్యక్రమాల ప్రకటన ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి బలమైన పునాదిగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా రాజకీయాల గురించి కూడా ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత రాజకీయాల గురించి తెలుసుకోవాలని, నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తరహా కామెంట్స్ ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ధనుష్ త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ పేరును ఎన్నికల సంఘం వద్ద కూడా నమోదు చేయించు కున్నారంటూ వార్తలు వచ్చాయి.




