Monday, 9 November 2026

ఉచిత బ‌స్సు ప‌థ‌కం ర‌ద్దు చేయం : సీఎం

newsseals-CM

వికారాబాద్ జిల్లా : స్వ‌యం స‌హాయ‌క సంఘాలు సాధికార‌త సాధించేలా త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌న మూడు రోజుల పాటు కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. వేల కోట్ల రూపాయ‌ల అభివృద్ది ప‌నుల‌ను ప్రారంభించారు. మ‌రి కొన్నింటికి శంకుస్థాప‌న చేశారు. దేశంలోనే తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆద‌ర్శ ప్రాంతంగా చేసేంత వ‌ర‌కు తాను నిద్ర పోన‌ని అన్నారు రేవంత్ రెడ్డి. స్వయం సహాయక సంఘాలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జ‌రుపుకోవ‌డం ఆనందం క‌లిగిస్తోంద‌ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కోటి మంది మహిళలను ఆర్థిక సహాయం , ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లక్షాధికారులుగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు. మీ ఆశీస్సులు నాకు బలాన్నిస్తాయి. నాకు వ్యక్తిగత కోరికలు లేవు, ఉన్నత పదవుల పట్ల ఆశ కూడా లేదు. కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మార్చడమే నా ఏకైక లక్ష్యం అన్నారు. ఇందుకోసం నా శక్తిని పూర్తిగా ధారపోస్తాను అని ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి.

మహిళలు తమ కుమార్తెలకు ఉన్నత విద్యను అందించేలా చూడాలని, ఈ విషయాన్ని తన పుట్టినరోజున ఒక సంకల్పంగా తీసుకోవాలని ఆయన కోరారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ కుమార్తెలకు రాకూడదు. మహిళల చేతుల్లో బాధ్యత ఉన్నప్పుడు, ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అని ఆయన అన్నారు. మహిళలు పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నారని, సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ భాగస్వాములు అవుతున్నారని ఆయన గుర్తు చేశారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా ₹79,000 కోట్ల రుణాలను అందించామని, ఆ రుణాలపై వడ్డీ కింద ₹1,900 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. అలాగే, ఇళ్ల స్థలాల పట్టాలను మహిళల పేరు మీదనే జారీ చేశామని, ‘మహాలక్ష్మి’ పథకం కోసం ₹13,000 కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ, గతంలో నష్టాల్లో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ పథకం వల్ల లాభాల బాట పట్టిందని ఆయన వివరించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదు అని ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *