హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. చెరువుల ఆక్రమణలపై స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదులకు హైడ్రా తక్షణమే స్పందిస్తోంది. ఇప్పటికే పలు చెరువుల చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది . తాజాగా మరో రెండు చెరువులను పరిరక్షించింది. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ మండలం దొమ్మర పోచంపల్లి గ్రామంలోని 3.11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ‘గొల్లవాని కుంటను హైడ్రా రక్షించింది. ఈ చెరువును మట్టితో పూడ్చి ఆక్రమించేందుకు ప్రయత్నించగా దాని చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఇది చెరువు ప్రాంతమని పేర్కొంటూ అక్కడ బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. అదే జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం దేవేంద్రనగర్ పరిధిలో ఉన్న ‘చింతల చెరువు’ను కూడా హైడ్రా ఆక్రమణల నుంచి కాపాడింది.
ఈ చెరువుకు సంబంధించి మొత్తం 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో సర్వే నంబర్ 329 పరిధిలో గతంలోనే ఆక్రమణలను తొలగించినప్పటికీ అక్కడ మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. కొందరు వ్యక్తులు చెరువు భూమిలో తాత్కాలిక షెడ్లు వేసి ఆక్రమించు కున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన హైడ్రా 9 ఎకరాల చెరువు భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేసి దానిని పరిరక్షించింది. అలాగ ఇది చెరువు ప్రాంతమని తెలియజేసే బోర్డులను కూడా అక్కడ ఏర్పాటు చేసింది.




