విజయవాడ : రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఆదివారం ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారి అనిల్ చంద్ర పునేఠా మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని వార్డుల సభ్యుల స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయి, కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ / విలీనానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసిందన్నారు. పోలీసు, పోలింగ్ సిబ్బంది నియామకం, రవాణా, ఇతర ఎన్నికల నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రక్రియలో కింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు సీఈఓ.
విలీనం చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 650 మందికి మించరాదని, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పోలింగ్ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఒకే ప్రాంగణం లేదా ఒకే ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను మాత్రమే విలీనం చేయాలని, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలను విలీనం చేయరాదన్నారు. విలీనం చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు మార్గనిర్దేశం చేసేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఆయా ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా సమాచారం అందించాలని అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.




